World's first medical networking and resource portal

Community Weblogs

Sep17
డాక్టర్ని సంప్రదించి, మందులు వాడుకోవటం తప్పనిసరి అయినపుడు అందులో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే జబ్బు నయం అవటంతోపాటు మందులవల్ల జరిగే నష్టాలను నివారించుకోవచ్చు. అలా కాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చివరకు బాధపడేది రోగినే. కాలం కలిసిరాకపోతే జరిగే నష్టం ప్రాణం పోయేంత ఉండవచ్చు. మందుల వాడకంలో పాటించాల్సిన అంశాలు, తీసుకోవాల్సిన జాగతర్తలు ఇవీ. 1. మీ డాక్టర్ రాసే మందులు మీకు అర్థం అవుతున్నాయో లేదో పరిశీలించండి. డాక్టర్లది బ్రహ్మరాతనీ, మెడికలు షాపువారికి తప్ప మరెవరికీ అర్థం కాదనే ఛలోక్తులు మనకు ఉండనే ఉన్నాయి. మందుల్ని విడి అక్షరాలలో రాయలనేది ఏ డాక్టరూ ఎవరూ పాటించని రూలు. 2. సాధారణంగా డాక్టరుకి అనుబంధంగా ఉన్న మెడికలు షాపుల్లో డాక్టరు రాసినవి తప్ప వేరేవి ఇవ్వరు. కానీ బయట కొనాల్సినపుడు ఆ మందులు, వారి దగ్గర లేనప్పుడు ఉన్న అలాంటి మందును అంటగట్టడానికి ప్రయత్నిస్తారు. దాని నాణ్యత మనకు తెలియదు. ఉదాహరణకు నొప్పులకు మీ డాక్టరు ఒక బ్రాండు మందు రాస్తే, 10 మాత్రల ఖరీదు 30 రూపాయలు. దాని మీద 10 శాతం మందుల షాపువారికి లాభం ఉంటుంది. అంటే లాభం మూడు రూపాయలు. అలాంటిదే ‘జెనెరిక్’ రూపంలో బోలెడు దొరుకుతాయి. దానిపైన గరిష్ట చిల్లర ధర 30 రూపాయలే ఉంటుంది కాని అది షాపువారికి కేవలం నాలుగు రూపాయలకే దొరుకుతుంది. 3. నిజంగా డాక్టరు రాసిన మందు దొరక్కపోతే మళ్ళీ డాక్టరు దగ్గరకు వెళ్ళి మార్పించుకోవాలే తప్ప షాపువాడు ఇచ్చింది తీసుకోకూడదు. మీరు ఏ బ్రాండు వాడాలో నిర్ణయించాల్సింది డాక్టరు, మందుల షాపు వాళ్ళు కాదు. మెడికలు షాపువారికి మందుల్ని గురించి అంతా తెలిసి ఉంటుందన్న భ్రమలు వదలాలి. 4. మందుపేరు, మోతాదు సరిగా ఉన్నాయో లేదో సరిచూసుకోండి. చాలాసార్లు పేరులో సారూప్యత ఉన్నందువల్ల ఒకదానికి బదులు మరొకటి ఇస్తారు. ఉదాహరణకు పిల్లల్లో అతి చురుకుదనంకోసం వాడే ‘అటిరోమాక్సిటిన్’కు బదులుగా కేన్సరు చికిత్సలో వాడే ‘టొమాక్సిపైన్’ అనే మందును ఇచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలాగే డోసు కూడా ఒకటికి రెండుసార్లు సరిచూసుకోవాలి. కొన్నిసార్లు 0.5కి బదులు 5 ఎం.జి ఇచ్చే అవకాశం ఉంది. 5. కొనబోయే ముందు దానిపైన మందు వాడటానికి ముందు ముగింపు (ఎక్స్‌పైరీ) తేదీని గమనించి కొనండి. బీపీ, చక్కెర జబ్బు, మానసిక సమస్యలకు మందులు వాడేవాళ్ళు కొన్నిసార్లు మూడు నాలుగు నెలలకు సరిపడా మందులు ఒకేసారి కొంటారు. అలాంటప్పుడు దగ్గర ముగింపు తేదీ ఉన్న మందులు కొనకుండా కనీసం నాలుగు నెలల గడువు ఉండేవిధంగా కొనుక్కోవాలి. 6. మందుల షాపు వాళ్ళు ‘ఫిజీషియన్ శాంపుల్’ అమ్మటానికి ప్రయత్నిస్తుంటారు. వాటినికొనవద్దు. డాక్టర్లు వీటిని తెలిసినవారికి ఉచితంగా ఇస్తారు. సరిపోయినన్ని ఇస్తే ఫర్వాలేదు. రెండు మూడు మాత్రలు ఇచ్చినపుడు మిగతా మందులు కొనాల్సి వస్తుంది. డాక్టరు ఇచ్చినా మర్యాదగా వాటిని తిరస్కరించండి. కారణం మిగతా మందులు కొనాలంటే అదే బ్రాండు దొరక్కపోవచ్చు. పైగా మందుల తయారీ బ్యాచ్చీ, ముగింపు తేదీలు తేడాగా ఉంటాయి. ఏ డాక్టరు అయినా శాంపుళ్ళను అమ్మటం మీ దృష్టికి వస్తే అతని దగ్గరకు వెళ్ళనే వెళ్ళవద్దు. ఇది డాక్టరు నైతిక పతనానికి పరాకాష్ఠ. 7. తక్కువ మాత్రలు కొనేటప్పుడు కత్తిరించి ఇస్తారు. దాంతో కొన్నిసార్లు మందు పేరు, ముగింపు తేదీ వేరుపడిపోతాయి. ఎప్పుడైనా మనం మందును వాడాల్సి వస్తే అది ఏ మాత్రో తెలియదు. అందుకే అలాంటప్పుడు వాటిని ఒక కవరులో వేసి దానిపైన మందు పేరు, డోసు, ముగింపు తేదీని రాయించి తీసుకోండి. అవి పూర్తి అయ్యేవరకూ అదే కవరులో ఉండేటట్టు జాగ్రత్త పడాలి. 8. మందు చివర తిజ ,XL, XR, CR, SR, ER, OD,Chrono. Retard, Contin, అని ఉంటే అవి శరీరంలోకి కొద్దికొద్దిగా మందును విడుదల చేసేవి అని అర్ధం. ఇలాంటి మాత్రలను మొత్తంగా మింగాలే తప్ప కొరకటం, తుంచటం చేయకూడదు. అలాగే వీటిని నీటిలో కరిగించి కానీ, పొడి చేసి కానీ వాడకూడదు. అలా చేస్తే మందు అంతా ఒక్కసారిగా విడుదల అయిపోతుంది. కొన్నిసార్లు ఇది ప్రమాదానికి దారితీస్తుంది. మాత్రల మద్యలో గీత ఉంటే అలాంటివాటిని తుంచి సగం వాడుకోవచ్చు. 9. పిల్లలకోసం వాడే సిరప్పులు కొనేటపుడు పొడి రూపంలో ఉంటాయి. నీరు పోసి కలపటంవల్ల అవి సిరప్పుగా మారుతుంది. ఇలా తయారుచేసిన సిరప్పును వారంలోపలే వాడాలి. ఆ తరువాత వాడితే ఆ మందు ప్రభావం తగ్గిపోతుంది. అలా తగ్గకుండా ఉంచటానికే వాటిని వాడబోయేముందువరకూ పొడి రూపంలో తయారుచేస్తారు. కాబట్టి మిగిలి ఉంటే పారెయ్యాలి తప్ప మళ్ళీ అవసరానికి ఉంచకూడదు. 10. నేరుగా సిరప్పుల రూపంలో దొరికే సీసా మందును మూత తెరచిన నెలలోపే వాడాలి. మిగిలితే పడెయ్యాలి. 11. పిల్లలకు వాడే సిరప్పులు సరిగా కొలత ప్రకారమే వెయ్యాలి తప్ప కొసరు వెయ్యకూడదు. చాలామంది తల్లులు జబ్బు త్వరగా తగ్గనపుడు చెప్పినదానికంటే కాస్త కొసరు వేస్తారు. ముఖ్యంగా దగ్గు మందులు. పిల్లలకు దగ్గు ఏమాత్రం కాస్త ఎక్కువ అయినా ఇంకొక డోసు ఇస్తారు. అలా చెయ్యకూడదు. 12. మందులను పిల్లలకు అందకుండా ఉంచాలి. వాటితో ఆడుకోవడం మంచిదికాదని పిల్లలకు నేర్పాలి. 13. అన్ని మందులు అందరికీ పడవు. ఈ విషయం డాక్టరుకి కూడా తెలియదు. మందులు ఏమైనా పడకపోతే ఆ విషయం ముందుగానే డాక్టరుతో చెప్పాలి. 14. కొన్ని జబ్బులవారికి కొన్ని మందులు వాడటంవల్ల ఆ పాత జబ్బు రెచ్చిపోతుంది. మచ్చుకు ఆస్తమా ఉన్నవారు బీటా బ్లాకరు తరగతి మందులు వాడితే ఆస్తమా వస్తుంది. థైరాయిడు జబ్బు ఉన్నవారికి దిగులు జబ్బుకు వాడే లీథియం మందు వాడకూడదు. కాబట్టి మీకు ఇతర నిడివికాల జబ్బులు, అప్పుడప్పుడూ వచ్చిపోయే జబ్బులు ఉంటే ముందుగానే డాక్టరుకు చెప్పాలి. 15. కొన్ని మందులు పర్యవేక్షణ లేకుండా వాడకూడదు. అంగం లేవటానికి వాడే ‘సిల్డనాఫిల్’ అనే మందును డాక్టరు సలహా లేకుండా వేసుకుంటే ఆ మందు నాకు పడలేదని చెప్పటానికి మీరు ఉండకపోవచ్చు. కారణం మీరు గుండెకు సంబంధించిన యాంజైనా అనే జబ్బుతో బాధపడుతూ దానికి మందులు వాడేవారు అయి ఉండవచ్చు. అపుడు మాత్ర వాడగానే ప్రాణం హరీ అంటుంది. 16. డాక్టరు చెప్పినంతకాలం మందులు వాడాలి. మీకై మీరు నిర్ణయం తీసుకొని మార్చటంవల్ల వచ్చే నష్టాలను అనుభవించేది మీరే. 17. చాలామంది మందుల్ని దేనితో వేసుకోవాలనేది పెద్ద ప్రశ్న. ఏ మందులు అయినా నీటితో వేసుకోవాల్సిందే. అయితే కొన్ని నోటిలో కరిగే మందులు ఉంటాయి. వాటిని చప్పరిస్తే సరిపోతుంది. సాధారణంగా అలాంటి మందు పేరు చివర ఎం.డి అని ఉంటుంది. అంటే ‘మవుత్ డిసాల్వింగ్’ అని అర్ధం. ఇలా చప్పరించే మందులు మింగే మందులతో పోలిస్తే త్వరగా పనిచేస్తాయి. 18. వైద్యం జరిగేటపుడు అందరూ అడిగే ప్రశ్న పత్యం ఏమిటని. సాధారణంగా 95 వంతులు జబ్బులకు పత్యం అంటూ ఏమీ ఉండదు. పత్యం పాటించాల్సిన అవసరం ఉంటే మీరు అడగకుండానే డాక్టరు చెబుతాడు. 19. మందులకు- తిండికి చాలా సంబంధం ఉంది. నొప్పికి వాడే మందులన్నీ ఖచ్చితంగా తిన్నతరువాతే వేసుకోవాలి. అసిడిటీకి వాడే మందుల్ని దాదాపు తిండికి ముందే వేసుకోవాలి. ఎప్పుడు వేసుకోవాలనేది సాధారణంగా డాక్టరే చెబుతాడు. చెప్పకపోయినా మీరు అడగవచ్చు. 20. కొన్ని మందుల్ని పొద్దున మాత్రమే వాడాలి. మరికొన్ని పడుకోవటానికి ముందు వేసుకోవాలి. తారుమారు అయిందంటే గందరగోళం అవుతుంది. ఏ మందు ఎప్పుడు వేసుకోవాలనేది డాక్టరే చెబుతాడు. అనుమానం వస్తే ఒకటికి రెండుసార్లు సరిచూసుకోవాలి. 21. కొన్ని మందులు కొందరికి పడవు. అలాంటప్పుడు కడుపులో వికారంగా ఉండటం, వాంతులు, విరోచనాలు, నిద్రపట్టకపోవడం, మత్తుగా ఉండటం లాంటి స్వల్పకాలిక లక్షణాలనుండి ప్రాణం మీదకు వచ్చే వరకూ ఉండొచ్చు. 22. ఏ మందు అయినా పడలేదని అనిపిస్తే, వాటిని వేసుకోవటం ఆపి వెంటనే డాక్టర్ని కలవాలి. సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు మీ డాక్టరు అందుబాటులో లేకపోతే ఆలస్యం చేయకుండా అందుబాటులో ఉన్న మరో డాక్టరును సంప్రదించాలే తప్ప మీ డాక్టరు దొరికే వరకూ వేచి ఉండకూడదు. 23. పిల్లలకు మందులు ఎక్కువ భాగం సిరప్పుల రూపంలో వాడుతుంటారు. ఇవే కాకుండా కంటికి వాడే మందులు, చెవి, ముక్కులో వేసుకొనే చుక్కల మందులు ఒకసారి మూత తెరిచాక వాటి అవసరం అయిపోయాక పడెయ్యాలే తప్ప నెలల తరబడి మళ్ళీ అవసరానికి పనికివస్తుందిలే అని ఉంచకూడదు. మూత తెరిచాక ఎంతకాలం వాడవచ్చని డాక్టర్ని అడగండి. 24. కొన్ని మందులు వాడేటప్పుడు తూగు వస్తుంది. కానీ సర్దుకొని అలవాటు అయ్యేవరకు బండ్లు నడపడం, యంత్రాలమీద పనిచేయడం చేయకూడదు. సాధారణంగా ఇలాంటి మందులు రాసేముందు డాక్టరు ముందుగానే చెబుతారు.


Comments (0)  |   Category (Psychiatry)  |   Views (1417)

Community Comments
User Rating
Rate It


Post your comments

 
Browse Archive