ఎవరికైనా జబ్బు చేసినపుడు ఏ డాక్టరు దగ్గర చూపించుకుంటే బాగుంటుందో నలుగుర్ని అడిగి విచారించుకొని పోతాం. మనకు వచ్చిన సమస్యను బట్టి వెళ్లాల్సిన డాక్టరు అర్హతలు, అనుభవమూ, స్తాయి మొదలైన విషయాలు తెలుసుకొని మరీ పోతాం. డాక్టర్ని కలిశాక ఆయన మాట్లాడే విధానం, ప్రవర్తించే తీరు, వ్యవహార శైలీ, ఓపిగ్గా వినటం. వైద్యంతో పాటు ధైర్యం చెప్పటంలాంటి అంశాలలో డాక్టరు రోగికి తగ్గట్టు ఉండాలని ఆశిస్తారు. ఒక విధంగా చెప్పాలంటే చేసే వైద్యమే కాకుండా ఆయన మొత్తం ప్రవర్తన మనకు నచ్చాలి. లేదంటే రెండోసారి మరో డాక్టరు కోసం వెతుక్కుంటాం. అంతవరకూ సరే. మరి డాక్టరు వైపు నుంచి కూడా ఆలోచించాలి కదా! ఫీజు కడుతున్నాం కాబట్టి వైద్యం చేస్తున్నాడు అనుకుంటే సరిపోదు. రోగాన్ని తగ్గించటంలో రోగి ప్రవర్తన బాగా లేకపోతే? డాక్టరుకు రోగి నచ్చకపోతే? మీరు డాక్టర్ని మార్చినట్టు డాక్టరు పేషంటును వదులుకోవాలా? వదులుకుంటారా? సాధారణంగా అలా జరగదు. పరోక్షంగా రోగే నష్టపోతాడు. రోగం తగ్గటంలో డాక్టరు- పేషంటు సంబంధాలను అనేక అంశాలు ప్రభావితం చేస్తాయి. వచ్చిన జబ్బు, దానిపట్ల రోగికి ఉండే అవగాహన, నమ్మకాలు, తెలియనితనం, తోటివారు చెప్పే మాటలు, అర్థం చేసుకొనే తీరూ మొదలైన అంశాలు వైద్యంలో జోక్యం చేసుకుంటాయి. అన్నీ అనుకూలంగా ఉంటే వైద్యం సజావుగా సాగుతుంది. అనుకూలంగా లేకపోతే నష్టం జరుగుతుంది. జరిగే నష్టం ఎప్పుడూ రోగికే. నష్టం ఏ రూపంలో అయినా ఉండొచ్చు. కాబట్టి మంచి డాక్టరును వెతుక్కోవటమే కాదు మంచి పేషెంటుగా వ్యవహరించాలి.
సంప్రదింపు (కన్సల్టేషన్) ఫీజులో అస్సలు బేరం ఆడవద్దు. సంతోషంగా ఇవ్వండి. ఒక డాక్టరు ఫీజు మరో డాక్టరుతో పోల్చకూడదు. ఏ డాక్టరు అయినా తన ఫీజును మిగతా డాక్టర్లకంటే ఎక్కువగా పెట్టుకున్నాడంటే సహజంగా ఆయన క్వాలిటీ వైద్యం చేయగలననే ధైర్యం లేకపోతే అంత ఫీజు నిర్ణయించుకోడు. మరో విషయం, సలహాకు కూడా ఫీజు కట్టాల్సిందే. మందులు రాయలేదు కదా మాట్లాడినందుకు డబ్బులెందుకు అనుకొంటారు కొంతమంది. క్రొత్తగా ప్రాక్టీసు పెట్టిన డాక్టరుకి ఇలా అడిగే వాళ్ళు నలుగురు తగిలితే చాలు. నిజంగా మందులు అవసరం లేకపోయినా ఏదో ఒక సూది వేయటమో, అర్థం కానీ వైటమిను మాత్రలు రాసివ్వటమో చేస్తారు.
డాక్టరు దగ్గర మీ రోగ లక్షణాలు ఎంత బాగా చెప్పగలిగితే మీరు అంత బాగా లాభపడతారు. మొదట మీరు వివరించే తీరులోనే చాలావరకు రోగ నిర్థారణ జరిగిపోతుంది. చాలా పరీక్షలు చేయాల్సిన అవసరం ఉండదు. మీరు డాక్టర్ని ఎంత గందరగోళ పరుస్తుంటే అంతగా మీ పరీక్షల లిస్టు పెరిగిపోతుంది. సాధ్యమైనంత వరకూ మీ రోగ లక్షణాలను, దానికి సంబంధించిన ఇతర వివరాలను కాగితంమీద రాసుకొని వెళ్ళండి. రోగ చరిత్ర చెప్పటంలో తేడా వచ్చిందంటే మీ జేబుకు బొక్కపడిందే.
వచ్చిన జబ్బును బట్టి వైద్యం చేస్తున్నా అన్నీ అనుకూలంగా ఉంటే అది తగ్గటానికి కొంత సమయం పడుతుంది. అననుకూల పరిస్థితుల్లో ఇంకా ఎక్కువ కాలం పట్టవచ్చు. మచ్చుకు తెగిన గాయం మానాలంటే కనీసం వారం పడుతుంది. అదే గాయానికి చీము పడితే నెల కూడా పట్టవచ్చు. స్కిజోఫ్రెనియా అనే మానసిక జబ్బు ఆసుపత్రిలో పెట్టి బాగా వైద్యం చేస్తున్నా కొంతలో కొంత మార్పు రావటానికి కనీసం రెండు నెలలు పడుతుంది. చేర్చిన వారానికే కొంచెం కూడా తగ్గలేదని నసపెడితే డాక్టరుకు చిర్రెత్తుకు వస్తుంది. జబ్బుకు ‘కాంప్లికేషన్’ వస్తే ఎన్ని రోజులు పడుతుందనేది ముందుగా చెప్పలేరు.
డాక్టరును కలవటానికి వచ్చే ముందు అంతకుముందు డాక్టర్లు రాసిన కాగితాలు, పరీక్షల రిపోర్టులు వాడిన మందులు మీ దగ్గర ఉంటే ఖచ్చితంగా వాటిని తీసుకువెళ్ళండి. అవి రోగ నిర్థారణకే కాక అనవసర పరీక్షలు తప్పవచ్చు. కొంతమందికి కొన్ని మందులు పడవు. కొత్తగా మందు వాడేటప్పుడు ఆ విషయం తెలియదు కానీ అంతకుముందు వాడినప్పుడు మీకు పడకుండా ఉంటే ఆ విషయం డాక్టరు మందులు రాయటానికి ముందే చెప్పండి. చెప్పకపోతే రియాక్షనుతో ఇబ్బంది పడేది మీరే.
మీ జబ్బు తగ్గటంలో డాక్టరు సలహాదారు. ఎన్ని రోజులకు ఒకసారి వచ్చి కనపడాలో చెప్పినపుడు దాన్ని ఖచ్చితంగా పాటించండి. టీబీ లాంటి నిడివికాలరోగాలకు, మధుమేహం, బీపీ లాంటి జీవితకాల రోగాలకు క్రమం తప్పకుండా అపాయింటుమెంట్లను పాటించాలి. పోయినపుడల్లా అవే మందులు వాడమని చెబుతాడు కదా! అని ఫీజు మిగులుతుందని మరో మూడు నెలలు అవే మందులు వాడుకొని వస్తారు. ఇక్కడ డాక్టరు ఉద్దేశం నెల తరువాత ఒక మందు ఆపాల్సి ఉంటుందని. రోగి తెలివిగా రెండు నెలల ఫీజు మిగిల్చానని అనుకోవచ్చు. రెండు నెలలు అనవసరంగా మందులు వాడకంవల్ల అటు డబ్బు పోవటంతో పాటు, రెండు నెలలు పాటు అవసరం లేని మందును మింగినట్టే కదా!
మీ జబ్బును గురించి ఎన్ని సందేహాలు అడిగినా డాక్టర్లు చెబుతారు. డాక్టరు కాస్త ఓపిగ్గా, వివరంగా సందేహాలు తీరుస్తుంటే, రోగి కానీ లేదా వారి బంధువులు కానీ దాన్ని అలుసుగా తీసుకొని లేనిపోని సందేహాలు, సంబంధం లేని అనుమానాలను అడుగుతుంటారు. ఒకసారి మీరు ఇలా ప్రవర్తిస్తున్నారని డాక్టరికి అనిపిస్తే, సాధ్యమైనంత త్వరగా మీకు మందులు రాసి వదిలించుకోవాలని చూస్తారు. పైగా నిజంగా మీ రోగాన్ని గురించి అడిగినా ముక్తసరిగా సమాధానం చెప్పి ‘నెక్ట్స్’ అంటూ మరో పేషెంటు కోసం బెల్లుకొడతాడు. మీరు కన్సల్టేషను ఫీజు కట్టినంత మాత్రాన అయినదానికీ, కానిదానికీ ఫోను చేస్తే డాక్టరుకి చికాకుగా ఉంటుంది.
సాధ్యమైనంతవరకూ డాక్టరుకు ఫోను చెయ్యటం తగ్గించండి. ఏ ఇబ్బంది వచ్చినా వెళ్లి మాట్లాడటం మంచిది. వీలున్నంతవరకూ ఆసుపత్రికే ఫోను చేయండి. ఎమర్సెన్సీ తప్ప రాత్రులు నేరుగా డాక్టరుకి ఫోను చెయ్యద్దు. ఫీజు కడుతున్నాం కదా అని నిద్దురలేపే హక్కు మీకు లేదు. ఫోను చెయ్యాల్సి వచ్చిన ప్రతిసారీ డాక్టరు రాసిన మందుల చీటి దగ్గర పెట్టుకొని ఫోను చెయ్యాలి. ముందుగా మిమ్మల్ని మీరు పరిచయం చేసుకొని, ఎవరి గురించి మాట్లాడుతున్నారో చెప్పి తరువాత సంభాషణ కొనసాగించాలి
Posted on Tuesday, 16th November 2010
Community Comments
User Rating
Rate It