‘నాకేకొద్ది కంచం, గోకేకొద్ది తీట’ బాగుంటాయనేది తెలుగు నానుడి. అనుభవించేవారికే తెలుస్తుంది వాటి మాధుర్యం. ‘క్లిక్కుకొద్ది నెట్టు, సర్ఫుకొద్ది సమాచారం’ అనేది ఇంటర్నెట్‌ను వాడే ‘నెటిజన్’ల నానుడి. అవునన్నా కాదన్నా ఇపుడు ప్రజల్లో అత్యంత ప్రజాదరణ పొందిన సమాచార సాధనం ఇది. ఆవగింజనుండి అంతరీక్షం దాకా ఎపుడు ఎక్కడ ఏ సమాచారం కావాలన్నా క్లిక్కువేటు దూరంలో "ప్రపంచ సాలెగూడు తావులు"(world wide websites) మన ముందు ఉంచుతాయి ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అందించిన మాయాజాలమే ఇంటర్నెట్టు. అన్ని రంగాలలో ఇంటర్నెటు ఉపయోగపడ్డట్టే వైద్యంలోనూ ఇంటర్నెట్టు ఉపయోగపడుతుంది. రోగాన్ని గురించి, వైద్య పద్ధతుల గురించి, మందులను గురించిన సమాచారం కోసం చాలామంది ఇపుడు ఇంటర్నెట్టు ‘వెతుకు మర’( Search engine) పై ఆధారపడుతున్నారు. ఆ రకంగా దాని ఉపయోగం అంతా ఇంతా కాదు. అయితే ఏ సమాచారాన్ని ఎలా ఉపయోగపెట్టుకోవాలనేది ఉపయోగించే వ్యక్తి అవగాహనా సామర్థ్యంమీద, పొందే సమాచారపు విలువ మీదా ఆధారపడి ఉంటంది. ఉపయోగించాలే కానీ నెట్టులో దొరికే సమాచారంతో డాక్టర్లు ఎప్పటికప్పుడు వైద్య పద్ధతులను, మెళకువలను తాజాపరుస్తుంది. గతంలో డాక్టర్లు వైద్య సమాచారం పొందాలంటే పుస్తకాలమీద, జర్నళ్లమీద ఆధారపడేవారు.
తెలుసుకోవాలనుకున్న విషయం ఎక్కడ ఉందో వెతుక్కోవటానికి చాలా సమయం పట్టేది. పైగా పుస్తకాల ఖరీదు వేలల్లో ఉంటుంది. ఇప్పుడు ఆ అవసరం లేదు. కావాల్సిన సమాచారం ఒక క్లిక్కుతో క్షణాల్లో ప్రత్యక్షమవుతుంది. ఇపుడు ప్రతీ వైద్య కళాశాలలో విద్యార్థులకు ఇంటర్నెట్టు ఖచ్చితంగా అందుబాటులో ఉండాలనేది ప్రభుత్వం నిబంధన విధించింది. వైద్యులకు మెడలో స్టెతోస్కోపుతో పాటు ఇంటర్నెట్టు కనెక్షను ఉండాలని బహుశా నిబంధనలు రావచ్చు.
ఇంటర్నెట్‌లో అత్యంత విలువైన పరిశోధన అంశాలనుండి పనికిరాని పరమ చెత్తవరకూ ఉంటుంది. అయితే ఏ 'తావు'(site)లో దొరికే సమాచారం సరైనదో తెలుసుకోవడం డాక్టర్‌కు పెద్ద పనేం కాదు. కానీ సాధారణ జన విషయంలో కొంత ఇబ్బంది ఉంటుంది. దాన్ని సరైన విధంగా ఉపయోగపెట్టుకుంటే వైద్యం పొందటంలో అటు డాక్టర్లకూ, ఇటు జనానికి మేలు జరుగుతుంది. అలా కాకుండా నెట్టులో దొరికే సమాచారమంతా నిజమని నమ్మితే మాత్రం బుర్ర పాడవటం ఖాయం.
ముందు వెనకా ఆలోచించకుండా ‘తావు’లో దొరికే సమాచారాన్ని నేరుగా తలలోకి ఎక్కించుకున్నా, ఉపయోగించుకున్నా ఇబ్బందులు తప్పవు. వైద్యపరమైన అంశాలు అయితే వాటిపట్ల డాక్టరుకు అవగాహన ఉంటుంది కాబట్టి దాన్నుండి దేన్ని తీసుకోవచ్చు, దేన్ని తీసుకోకూడదు అనే విచక్షణని ఉపయోగిస్తారు. ఇంటర్నెట్టును విరివిగా ఉపయోగించే చాలామంది ముఖ్యంగా సాఫ్టువేరు వ్యక్తులు తమకు ఆరోగ్యపరమైన ఏ సమస్య వచ్చినా డాక్టరు దగ్గరకు పోబోయే ముందుగా వారికి ఉన్న లక్షణాలను నెట్టులో వెతుక్కుంటున్నారు. కావాల్సిన సమాచారానికి సంబంధించి ముఖ్య పదాలను "వెతుకు మర" టైపు చేయగా దానికి సంబంధించిన వేల తావులు తెరచుకుంటాయి. అయితే వీటిలో మొదటి రెండు మూడు పుటల(Pages)నే ఎక్కువ తెరుస్తారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఆయా ప్రభుత్వాల ఆరోగ్య శాఖలు, విశ్వవిద్యాలయాలు, వైద్య విజ్ఞాన సంస్థలు నిర్వహించే సైట్లు దాదాపు సరైన సమాచారాన్ని అందిస్తాయి. ఇవికాక వైద్యునికి సంబంధించిన వృత్తిపరమైన సంఘాలు అంటే, ‘ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ పెడియాట్రిక్స్’, ‘అమెరికన్ స్లీప్ ఫౌండేషన్’, ‘అమెరికన్ సైకియాట్రిక్ అసోసియేషన్’ లాంటి సంస్థలు నిర్వహించే సైట్లలో సరైన సమాచారం దొరుతుంది.
మరోవైపు కొన్ని వ్యాపార సంస్థలు వారి వస్తువుల్ని అమ్ముకొనేందుకు వీలుగా ఆ వస్తువులకు వైద్య ప్రాముఖ్యతను ఆపాదిస్తూ వైద్య సమాచారం పేరుతో తప్పుడు సమాచారాన్ని అందిస్తాయి. ఉదాహరణకు గురకను తగ్గించటానికి ‘మొక్క మందులు’ (Herbal medicine) శాస్ర్తియంగా పనిచేస్తాయని చెప్పటానికి నానా చెత్త విషయాలను అశాస్ర్తియంగా అంశాలుగా తమ సైటులో ఉంచుతారు. అది నిజమే అని నమ్మిన గురకపెట్టే వ్యక్తి నెట్టులో దాన్ని కొంటాడు. అలాగే ‘లైంగిక ఉత్తేజకాలు’ మీరు వెతుకుమరలో టైపుచేస్తే కావాల్సినన్ని సైట్లు తెరచుకుంటాయి. కానీ నిజానికి అలాంటి ఉత్తేజకాలు ఏమీ ఉండవు. నెట్టులో వైద్య సమాచారం వెతికేవారు రెండు రకాలుగా ఉంటారు. మొదటిరకం తమకు జబ్బు చేసినపుడు అది ఫలానా జబ్బు అని వారికి వారే నిర్ణయించుకొని దాన్ని గురించి తెలుసుకోవటానికి నెట్టులో వెతికేవారు. ఉదాహరణకు ‘దగ్గు’ ‘జ్వరం’ అని ‘వెతుకు మర’లో చూస్తే వేలసైట్లు వీటిని గురించిన సమాచారంతో ప్రత్యక్షం అవుతాయి. వైద్యపరమైన దన్నులేనివారు వాటిని వర్తింపజేసుకోవటంలో అయోమయానికి గురికావటం, భయపడటం జరుగుతుంది.
రెండో రకం డాక్టరు దగ్గర చూపెట్టుకున్నాక డాక్టరు జబ్బును ఫలానా అని నిర్థారించి వైద్యం మొదలుపెట్టాక దాన్ని గురించి అదనపు సమాచారం కోసం ‘వల’లో వెతకటం. సాధారణంగా డాక్టర్లు వైద్యం చేసేటప్పుడుమీ హాని కలిగిస్తాయి అన్న విషయాలను తప్ప వైద్యంలో వచ్చే చిన్న చిన్న సమస్యలను, అరుదుగా తలెత్తే ఇబ్బందుల్ని గురించి రోగితో చెప్పరు. చెప్పినా పైపైన, చాలా తేలిక చేసి చెబుతారు. అలా చెప్పకుండా ప్రతిదాన్ని భూతద్దంలో చూపించి చెబితే రోగి భయభ్రాంతులకు లోనయ్యే అవకాశం ఉంది.చివరిగా ఒక మాట- వైద్యులు, వైద్య విద్యార్థులు బైబిలు, ఖొరానులా పరిగణించే ‘హచ్చి సన్సు క్లినికల్ మెథడ్స్’ అనే పుస్తకం ఇప్పటికీ యాభైసార్లు తిరిగి రాశాక కూడా తొలి రచయిత అయిన ‘హచ్‌సన్స్’ అన్న మాటలు ఇప్పటి ఎడిషన్‌లో కూడా మొదటిగా ప్రచురిస్తారు. అదేమిటంటే- ‘‘వైద్యశాస్త్రంలో ఎంత విప్లవాత్మక మార్పులు వచ్చినా, ఎన్ని అధునాతన యంత్రాలువచ్చినా అవి రోగాన్ని కుదర్చటంలో డాక్టరుకు "సహాయ"పడతాయే కానీ, డాక్టరుకు ప్రత్యామ్నాయంగా వచ్చే సమస్యే లేదు’’. ఇంటర్నెట్ వైద్య సమాచారం కూడా అంతే.
Posted on Tuesday, 16th November 2010
Community Comments
User Rating
Rate It