World's first medical networking and resource portal

Community Weblogs

Nov16
"వైద్యం చాలా పవిత్రమైనది" "వైద్యుడు నారాయణుడితో సమానం" ఇవి వారసత్వంగా కొనసాగుతున్న భావాలు. కాలం మారుతుంది. జనం మారుతున్నారు. వారి ఆలోచనా విధానం మారుతుంది. గతంలో మాదిరి వైద్యం చేయాలంటే ఏ ఆకునో, కాయనో నూరి మందుగా ఇస్తే కుదరదు. ఇస్తే జనం ఒప్పుకోరు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఎంత పెరిగినా కొన్ని జబ్బులకు వైద్యం లేదు. కొన్ని జబ్బులు బతికినంత కాలం ఉంటాయి. ఇంకొన్ని జబ్బులు తగ్గటానికి నెలలు, సంవత్సరాలు పట్టొచ్చు. మరికొన్ని జబ్బులు వాటి జ్ఞాపకాలను, అవశేషాలను వదిలిపోతాయి. ఇవి ఆయా జబ్బుల స్వభావం. ఆపరేషను చేయాల్సిన కేసుల్లో సర్జరీ మొదలైనప్పటినుంచి రోగి కోలుకొనేవరకూ కేవలం డాక్టరు సమర్థత ఒక్కటే చాలదు. రోగం తీవ్రత, రోగి శరీరం తట్టుకొనే తీరు, మందుల ప్రభావం, వైద్య వసతులు, రోగి చెల్లింపు సామర్థ్యం మొదలైనవన్నీ వాటి వాటి స్థాయిలో కలిసి రావాలి. వాస్తవ పరిస్థితి ఇలా ఉంటుంది. కాని రోగి అవగాహన, అర్థం చేసుకొనే తీరును బట్టి వారి ఆశింపు మరో రకంగా ఉంటుంది. ఏది ఎలా ఉన్నా, జనానికి ఆధునిక వైద్యం కావాలి. వైద్యంలో నాణ్యత ఉండాలి. రోగి ఆసుపత్రిలో అడుగుపెట్టే సమయానికి అన్నీ అమరినట్టు ఉండాలి. బాధతో ఉన్నప్పుడు వైద్యం ఆలస్యం కాకూడదు. త్వరగా జబ్బు తగ్గిపోవాలి. ఇవి సగటు రోగి ఆశింపు. రోగి ఆశించినట్టు వైద్య సేవలు అందించాలంటే డాక్టరు పూర్తిగా సమర్థుడై ఉండాలి. వైద్యాన్ని బాగా నేర్చుకోవాలి, కొత్త కొత్త పోకడల్ని నిరంతరం తెలుసుకుంటూ ఉండాలి. అందుకు వృత్తిపరమైన ‘కాన్ఫెరన్స్’లకు పోతూ ఉండాలి. ఎడిషను మారినపుడల్లా కొత్త పుస్తకాలు మారుస్తూ ఉండాలి. జర్నళ్ళకు చందా కడుతూనే ఉండాలి. అన్నింటికి మించి నిరంతరం చదువుతూనే వుండాలి. రోగం చేయటంలో ఏమైనా తేడా వచ్చి వినియోగదారుల ఫారంలో కేసు పడవచ్చు. "ఇన్ని కష్టాలు పడే మాకు కష్టానికి తగ్గట్టు డబ్బులు ఫీజు రూపంలో రావద్దూ?" ఇది రోగి ఆశింపుపై సగటు డాక్టరు కామెంటు. మరోవైపు డాక్టరుకి సామజిక బాధ్యత ఉండాలని సమాజం ఖచ్చితంగా ఆశిస్తుంది. ఇంజనీర్లకు, టీచర్లకూ, లాయర్లకూ, చార్టెడు అకౌంటెంట్లకూ ఇలా ఒకరనేం? ఎవరికీ సామాజిక బాధ్యతని జనం గుర్తుచేయరు. ఐ.ఐ.టీలలో, ఐ.ఐ.ఎంలలో ప్రజల డబ్బుతో చదివిన వారిని "సమాజం పట్ల మీ బాధ్యత ఏమిటని ఎవరూ అడగరు. వారు సమాజం డబ్బుతో చదవరా? కేవలం డాక్టరు మాత్రమే జనం డబ్బుతో చదువుతారా? డాక్టర్లు మాత్రమే జనాల సేవల తరించాలా?" వైద్యం మీద, వైద్యుల మీద చర్చ వచ్చిన ప్రతిసారీ డాక్టర్లు ముందుకు తెచ్చే ప్రశ్నలు ఇవి. ఇక్కడ కొన్ని వాస్తవాలు కుడా గమనించాలి. వైద్యుడిని దేవుడిగా నెత్తిన పెట్టుకునే ఈ జనమే వైద్యంలో ఎక్కడైనా తేడా వచ్చిందంటే ఊరకనే ఉండరు. అదే "దేవుడి"ని తిడతారు. కొన్నిసార్లు కొడతారు. ఆసుపత్రుల మీద దాడి చేస్తారు. మంచి సిటిజను అయితే జరిగిన నష్టానికి డబ్బులు కట్టించమని కోర్టుకు తిప్పుతాడు. వైద్యులకూ, డాక్టర్లకూ మధ్య ఈ విధమైన వైవిధ్యాలు రావటానికి కారణం ఏమిటంటే ‘డాక్టరు - పేషంటు’ మధ్య సంబంధాలను వాస్తవ దృష్టితో అర్థం చేసుకోలేక పోవటమే. జనం మారి, వైద్యం మారి, వైద్య పద్ధతులు మారి, వైద్యానికి సంబంధించి మిగతా అన్నిఅంశాలు మారినా వైద్యుల్ని చూడటంలో జనం ఆలోచనలు మాత్రం సంప్రదాయ పద్ధతుల్లో అలాగే ఉన్నాయి. అందుకే జనం ఆశింపుకూ, వైద్యుల ప్రవర్తనకూ మధ్య అంత అంతరం. సమాజంలో ఆర్థిక, సామజిక, సాంస్కృతిక అంశాలలో మార్పులు అనివార్యం. వాటితోపాటే మానవ సంబంధాలు మారుతూ ఉంటాయి. పూటకుళ్ళ ఇళ్ళు రెస్టారెంట్లు అయినట్లు, సత్రాలు స్టార్ హోటళ్ళు అయినట్టు వైద్యమూ దాని తీరుతెన్నులు మారాయిన్న అంశాన్ని పరిగణలోకి తీసుకోవటం లేదు. వైద్యాన్ని డబ్బులు తీసుకొని చేసే "సేవ"గా గుర్తించకుండా, పవిత్రమైనదిగా, డాక్టరును వైద్య నిపుణుడిగా కాకుండా దేవుడిగా, దయమయుడిగా, శాంతముర్తిలా, రోగ పీడిత దరిద్ర నారాయణులను ఆడుకోవటానికి పుట్టిన అవతార మూర్తులుగా భావించి నేటి కాలానికి తగ్గట్టు నైతికతను ఆశిస్తే ఎలా కుదురుతుంది? జనం మారి, వైద్యం మారి, వైద్య పద్ధతులు మారి, వైద్యానికి సంబంచిన అన్నీ మారినా వైద్యుల్ని చూడటంలో మాత్రం జనం ఆలోచనలను పాత పద్ధతుల్లోనే ఉన్నాయి. అంటే జనంలో ఉండే ద్వంద ప్రమాణ ఆలోచనల వల్ల వైద్యులకు, జనానికి మధ్య దూరం పెరుగుతుంది. మారే కాలంతో పాటు డాక్టర్లూ మారుతారు. చేసే వైద్యమూ మారుతుంది. దానికి తగ్గ ఖర్చూ పెరుగుతుంది. మార్పులన్నీ సమాజంలో వచ్చే మొత్తంలో భాగంగానే ఉంటాయి. వీటిని దృష్టిలో ఉంచుకొని "డాక్టరు - పేషంటు" సంబంధాన్ని చూస్తే వారి మధ్య సంబంధాలు సజావుగానే ఉంటాయి. లేదంటే పరస్పరం అనుమానంతోనే కలిసి నడవాలి. మిగతావారిని వదిలేసి డాక్టర్ల నుండి మాత్రమే సామాజిక బాధ్యతను ఆశించటంలో మరో కనబడని కోణం కూడా ఉంది. అదేమిటంటే రోగం వ్యక్తిని ప్రత్యక్షంగా బాధకు గురి చేస్తుంది. దాన్నుండి విముక్తి పొందాలంటే డాక్టరుతో ప్రత్యక్ష సంబంధం, వారి సేవలు అవసరం. అలాగే దానికి నేరుగా తనే ప్రత్యక్ష "చెల్లింపు" కూడా చెయ్యాలి. ఆ చెల్లింపు మనసులో "అయిష్టమైన చెల్లింపు" ఎలానో చూద్దాం. రోగం రావటం ఎవరికీ ఇష్టం ఉండదు. అయినా రాకుండా ఉండవు. వచ్చాక వైద్యం చేయించుకోక తప్పదు. ఇష్టం ఉన్నా, లేకపోయినా డాక్టరు దగ్గరికో, ఆసుపత్రికో పోయి వైద్యం చేయించుకోవాలి. అంటే జబ్బున పడ్డప్పుడు "రోగి- డాక్టరు" సంబంధం అనివార్యమూ, అవసరమూ. యిది ఇలా ఉంచుదాం. మనిషి అవసరాలు రెండు రకాలుగా ఉంటాయి. మొదటి రకం మనకు కావలసినవి, మనం ఇష్టపడేవి, మనకు ఆనందాన్ని ఇచేవి. వీటి కోసం వెంపర్లాడతాం. ఖరీదు అయిన టీవీ కొనటం, ఆరు రెట్లు ఎక్కువ పెట్టి నచ్చిన హీరో సినిమా టికెట్టును బ్లాకులో కొనటం, దప్పిక వేసినప్పుడు కోకకోల తాగటం, ఎంత డబ్బు పెట్టి అయిన మందు కొట్టటం ఇలా చాల పనులు ఎవరికి వారికి ఇష్టంగా ఉంటాయి కాబట్టి ఎంత డబ్బు పెట్టవనే దానితో పనిలేదు. ఇష్టమైన అవసరాలు కాబట్టి ఎంతైనా పెట్టవచ్చు. దీనికి బాధ పడేది ఏమి ఉండదు. రెండో రకం అవసరాలు మనకు ఇష్టం లేనివి. ఇష్టం లేకపోయినా అవసరం కాబట్టి వాటి కోసం ఖర్చు పెట్టాలి. లంచాలు, కోర్టు కేసులు, ఆసుపత్రి ఖర్చులు మొదలయినవి ఈ కోవలోకి వస్తాయి. ఇవి వచ్చాయి కాబట్టి అవసరాలు అయ్యాయి కాని నిజానికి మనం కోరుకోలేదు. కాబట్టి వీటికోసం ఖర్చు చేయటం సంతోషంగా ఉండదు. అయితే వీటిల్లో లోతుపాతులు మనకు తెలియదు కాబట్టి నిపుణుల సహాయం కావాలి. వారి సేవలకు "ఫీజు"చెల్లించాలి. కాని దానిమీద పెట్టే ఖర్చు బూడిదలో పోస్తున్నంత "ఫీలింగు" పదివేల రూపాయలు ఆలోచించకుండా ‘మందు’కు ఖర్చుపెట్టే వ్యక్తి దాన్ని మానటానికి వైద్యం చేసిన డాక్టరు బిల్లు ఐదు వేలు కట్టడానికి మనసు ఒప్పదు. దీనికి ఇంత అవుద్దా! అని ధర్మ సందేహం. డాక్టరు ఎక్కువ లాగుతున్నాడని లోలోన మథనం. డాక్టర్లు ఊరికే సంపాదిస్తున్నారని నింద. డాక్టర్లకు మానవత్వం లేదని కామెంట్లు. తీవ్రంగా గాయపడ్డప్పుడు వైద్యం చేయించుకోకపోతే ప్రాణం పోతుందనే భయం. తక్షణ ఆపద్బాంధవుడు డాక్టరు "ఎక్కడా? త్వరగా రాడే?" ఆ పరిస్థితిలో, ఆ సమయంలో రోగి ఆక్రందన అలా ఉంటుంది. డాక్టరు వచ్చాడు. వైద్యం జరుగుతూ ఉంది. ఫరవాలేదు. ఇపుడు బాగుంది. ‘బిల్లు ఎంత అవుతుందో’? రోగి అనుమానం. రోగం తగ్గింది. బిల్లు చేతికి వచ్చింది. అది ఎంతైనా ఉండనీ! ‘‘అమ్మ బాబోయ్ ఇంతా? ఈ డాక్టర్లకు కరుణ లేదు. దారుణంగా దోచేసుకుంటున్నారు’’, ‘‘ఏం పెద్ద ఊడబొడిచారనీ’’ ఇవి జబ్బు నయం అయ్యాక, సగటు రోగి ఆలోచనలు. దీనికి కారణం ఇష్టం లేని ‘అవసరం’ కోసం చెల్లించాల్సిరావటమే. అందుకే రోగికి డాక్టరు ప్రాణం పోయేటపుడు దేవుడుగానూ, రోగం తగ్గేటప్పుడు స్నేహితుడిగా, బిల్లు కట్టించుకొనేటప్పుడు యముడిలా కనిపిస్తాడని ఒక ఆధునిక నానుడి పుట్టుకువచ్చింది. చేయించుకున్న వైద్యానికి బిల్లు కట్టాల్సి వచ్చినపుడు రోగి మనసులో "అవసరం - అయిష్టత" పునాదిగా ఆలోచిస్తారు. మారిన సామాజిక నేపథ్యంలో వైద్యం చేసే డాక్టరు సేవ "సేవ - ప్రతిఫలం" అనే ఆలోచనల పునాదిగా ఫీజును ఆశిస్తాడు. ఈ రెండింటి మధ్య పొంతన ఎంత చెడిపోతే "డాక్టరు - రోగి" మధ్య సంబంధం కూడా అంతగా దెబ్బతింటుంది. రోగి - డాక్టరు మధ్య సంబంధాలను వ్యాపార సంబంధాలుగా పరిగణించి "వినియోగదారుల చట్టం" పరిధిలోకి తెచ్చాక కూడా "సేవ - దయ" అనే పాత పునాదులపై నుండి వైద్యాన్ని చూడటం సరికాదు. "సేవకు తగ్గ చెల్లింపు" రోగికి ఉండాలి. అలాగే ‘‘చెల్లించినదానికి నాణ్యమైన సేవ’’ను డాక్టర్లు అలవరచుకోవాలి. అంటే రోగి మంచి వినియోగదారుడై ఉండాలి. డాక్టరు నాణ్యత అందించగల ‘సర్వీసు ప్రొవైడరు’ అయి ఉండాలి. సేవకు తగ్గట్టు చెల్లించని మనస్తత్వం రోగికి ఉన్నపుడు ఏదో ఒక రూపంలో దాన్ని రాబట్టుకొనే విధంగా వైద్యులు ఉంటారు. వైద్యం అనే రైలు నడవాలంటే దానికి "రోగి - వైద్యుడు" రెండు పట్టాల్లాంటివారు. ఒక పట్టా అదుపు తప్పి, రెండోదాన్ని అదుపు తప్పకుండా బాగుండమని ఆశించడం సాధ్యం కాదు. ఈ నేపథ్యంలో వినియోగదారుడు వైద్యులపట్ల తమ దృక్పథం మార్చుకోవాలి. వైద్య వృత్తి పవిత్రమినదేమీ కాదు. కట్టిన డబ్బుకు అందించే సేవ మాత్రమే డాక్టరు గోప్పవాడేమి కాదు. అన్నీ పనుల్లో నిపుణులు ఉన్నట్టే డాక్టర్లు వైద్యంలో నిపుణులు. డాక్టర్లందరూ మేథావులు కాదు. అందరిలో ఉన్నట్టే డాక్టర్లలో కూడా మేథావులు ఉంటారు డాక్టర్లు కేవలం "మంచి"గా ఉంటారని ఆశించటం పొరపాటు. సమాజంలో ఎంత మంచి ఉంటుందో అంత కంటే ఎక్కువను ఎలా ఆశించటం? డాక్టరు చదువును దృష్టిలో ఉంచుకొని వైద్యంలో నాణ్యతని ఆశించాలి. ప్రతి డాక్టరుకు అన్నీ విషయాలు తెలిసి ఉండవు. తెలిసి ఉంటాయని ఎప్పుడు ఆశించవద్దు ఒకే డిగ్రీ చదివిన నిపుణుల మధ్య నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది సమాజంలో ఉండే అన్నీ రుగ్మతలు వైద్య వ్యవస్థలోనూ, వైద్యుల్లోనూ ఉంటాయని అర్థం చేసుకోవాలి. ప్రభుత్వ డాక్టర్లు ఉచితంగా సేవ చేయరు. మన తరపున ప్రభుత్వం చెల్లిస్తుంది


Comments (0)  |   Category (General)  |   Views (1792)

Community Comments
User Rating
Rate It


Post your comments

 
Browse Archive