World's first medical networking and resource portal

Community Weblogs

Nov16
52 ఏళ్ళ సత్యమూర్తి ఓ కార్పొరేటు సంస్థకు సి.ఇ.వో. లక్షల్లో జీతం. కాలు బైట పెడితే కారు. తినటానికి వీలు లేకుండా చేతిలో ఫోను. క్షణం తీరిక ఉండదు. రాత్రి ఏ రెండుకో కాని పడుకోవటానికి వీలు కాదు. తెల్లారి ఐదు గంటలకు లేస్తే కూడా పనులు పూర్తికావు. అలాంటి సత్యమూర్తిని ఒకేసారి బీపీ, షుగరు కూడబలుక్కుని ఆవహించాయి. డాక్టరను కలిస్తే వైద్య పరీక్షలన్నీ పూర్తయ్యాక మందుల వాడకం ఒక్కటే చాలదనీ, ‘లైఫ్ స్టైల్ మాడిఫికేషన్’ తప్పనిసరి అని చెప్పాడు డాక్టరు. ‘‘అంటే ఏం చేయాలి డాక్టర్!’’ అమాయకంగా అడిగాడు. ఆహార నియమాలు పాటించటం, వ్యాయామం చేయటం, ఒత్తిడి తగ్గించుకోవటం, రిలాక్సు కావటం అని హెడ్డింగులు మాత్రమే చెప్పి వివరాలు అదే ఆసుపత్రిలో ఉన్న నిపుణులను కలవాలని చెప్పాడు. ******************************** ఎందుకు మార్చుకోవాలి? ప్రకృతిలో ప్రతి జీవ జాతికి వాటిదైన జీవన విధానం ఉంటుంది. ఏ జాతి జీవులైనా అవి ఉండే ప్రదేశం వేరుగా ఉండవచ్చు కానీ వాటి ప్రవర్తన ప్రకృతి ఆదేశించిన దానికన్నావేరుగా ఉండేందుకు అవకాశం లేదు. ఒక జాతి జీవులన్నీ ఒకే విధమైన ‘‘స్టీరియో టైపిక్’’ ప్రవర్తన కలిగి ఉంటాయి. అంటే మందలో ఏ జంతువును చూసినా వాటి మధ్య తేడా లేకుండా ఒకే రకమైన ప్రవర్తన కలిగి ఉంటాయి. వాటి చేతిలో లేని అంశాలలో తప్ప వాటికి అవిగా తమ ప్రవర్తనవల్ల జబ్బులు కొని తెచ్చుకోలేవు. కానీ మనుషుల ప్రవర్తన ఇతర జీవజాతుల్లాగా ఒకేరకమైన ప్రవర్తనని కలిగి ఉండదు. ఆ మాటకొస్తే ఏ ఇద్దరు మనుషుల ప్రవర్తన ఒక రకంగా ఉండదు. మిగతా సంగతుల్ని అలా వుంచితే ఆరోగ్యాన్ని పరిరక్షించటానికి ప్రకృతి రూపకల్పన చేసిన శారీరక శ్రమ, తిండి, నిద్రలను విపరీతంగా దుర్వినియోగం చేయటంలో మనిషిది అందె వేసిన చెయ్యి. శరీరాన్ని ఎంతో కొంత కష్టపెట్టటం, అవసరం మేరకు తినటం, తగినంత సేపు నిద్రపోవటమనే సహజ ప్రవర్తనను ఎప్పుడు వదిలేస్తామో ఆ క్షణం నుండి ఆరోగ్యంగా ఉండాలని కోరుకోవటం దురాశే అవుతుంది. చేయాల్సినవి చేయకపోవటానికి తోడు, రోగాలను కొని తెచ్చుకొనే ప్రవర్తనని కలిగి ఉండే వారికి ఆరోగ్యం దూరమవటానికి ప్రయత్నం చేస్తుంది. మచ్చుకు పొగతాగటం, మద్యం సేవించటం, మాదక ద్రవ్యాలు వాడటం, నిర్లక్ష్య ప్రవర్తనవల్ల జరిగే ప్రమాదాలు మొదలైనవి. ఏ కొద్దిమందికో తప్ప చాలా మందికి ఆరోగ్యంగా ఉన్నంతకాలం దాని విలువ తెలియదు. కొందరికి దెబ్బ తగిలినపుడు తెలుస్తుంది. ఇంకొందరికి తగిలినా తెలియదు. ప్రతిదీ ఒకదానిపై ఒకటి పరస్పరం ఆధారపడి ఉన్న నేటి జీవనంలో ఆరోగ్యాన్ని పాడుచేయటానికి కావాల్సినన్ని మనకు తెలియకుండానే మన చుట్టూ ముసురుకొని ఉంటాయి. మచ్చుకు గతంలో రోడ్డు వరకూ ‘నడిచి’పోయి బస్సు లేదా ఆటో ఎక్కి ఆఫీసుకు పోయేవారు ‘బైకు’ కొనగానే ఆ నడక కాస్తా దూరం అయి కూర్చుంటుంది. తెలివిగా ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకొనే విధంగా జీవన సరళిని మార్చుకోకపోతే దానికి మూల్యం చెల్లించుకోక తప్పదు. ఆరోగ్యానికి సంబంధించి రెండు ప్రయోజనాల కోసం జీవన సరళిని మార్చుకోవాల్సి ఉంటుంది. మొదటిది వచ్చిన జబ్బును తగ్గించుకోవటానికి లేదా అదుపులో ఉంచుకోవటానికి సాధారణ జీవన సరళిని కాస్త మలుపు తిప్పి ప్రత్యేకమైన నడవడికను పాటించాల్సి ఉంటుంది. రెండోది జబ్బు లేక పోయినా మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుకోవటంలో భాగంగా జీవన సరళిని మార్చుకోవటం మరో పద్ధతి. మచ్చుకు అన్నవాహికకు సంబంధించిన ‘పేగు పుండు’ ఉండేవారికి భోజనం చేసి పడుకుంటే ఉన్నట్టుండి తిన్న తిండి గొంతులోకి ఎగదన్నినట్టు ఉండి ఛాతిలో తీవ్రంగా నొప్పి మొదలై నిద్ర లేపేస్తుంది. లేచి కూర్చుంటే కాసేపటికి నొప్పి తగ్గుతుంది. పడుకుంటే మళ్లీ నొప్పి మొదలవుతుంది. రోగ తీవ్రతను బట్టి రాత్రంతా నిద్ర లేకుండా గడిపేవారు ఉన్నారు. ఇది ఒక రోజుతో పోయే జబ్బు కాదు. మందుల వాడకానికి తోడు మసాలా తిండిని తగ్గించటం లేదా రాత్రిపూట మానేయడం, పొగ పూర్తిగా మానెయ్యటం, ఆల్కహాలు జోలికి పోకుండా ఉండటం, తాగినా రాత్రి వేళ తాగకుండా ఉండటం, పడుకోవటానికి కనీసం మూడు గంటల ముందు భోజనం చేయటం, మానసిక ఒత్తిడి, ఆందోళన తగ్గించుకోవటం, పడుకొనే మంచాన్ని తలవైపున కనీసం అర అడుగు ఎత్తుగా ఉంచుకోవటం అవసరం. ఇది జబ్బును అదుపులో ఉంచుకొనేందుకు వీలుగా మార్చాల్సిన ‘జీవనసరళి’. పై సూత్రాలను పాటించకుండా ఎన్ని మందులు వాడినా జబ్బు అదుపులోకి వచ్చే సమస్యే లేదు. ఈ సుత్ర్హాలను పాటించటంవల్ల మందుల జోలికి పోవాల్సిన అవసరం దాదాపు ఉండదు. ఇలా అనేక జబ్బులకు జీవనసరళి మార్పు అవసరం అవుతుంది. ఏ జబ్బుకు ఏ విధంగా నడుచుకోవాలో డాక్టర్లు వివరిస్తారు. జబ్బు వచ్చాకే కాకుండా అనేక జబ్బులకు దూరంగా ఉండటానికి కొన్ని సాధారణ పద్ధతుల్ని పాటించటం అవసరం అవుతుంది. అవసరం మేరకు తిండి ప్రకృతిలో మనిషి తప్ప మిగిలిన జంతువులన్నీ అవసరం మేరకే తింటాయి తప్ప అంతకు మించి ఒక్క రవ్వ కూడా ఎక్కువ తినవు. కానీ మనిషి పరిస్థితి అలా కాదు. అవసరానికి మించి అదనంగా తినటంవల్ల ప్రధానంగా వచ్చే సమస్య ఊబకాయం. ఈ ఊబకాయం బీపీ, షుగరు, కీళ్ళవాతం, గుండె జబ్బుల్లాంటి అనేక రోగాలు రావటానికి నెలవుగా ఉంటుంది. ఒకసారి షుగరు వచ్చాక తిండి మీద అదుపు లేకుండా జబ్బును అదుపుచేసే సమస్యే లేదు. కొద్ది కొద్దిగా ఎక్కువసార్లు తినే విధంగా తిండి అలవాట్లను మార్చుకోవాలి. అలా తినటం నాకు వీలు కాదు అంటే కుదరదు. జబ్బుకు తగ్గట్టు మనం పోవాలే కానీ మన ప్రకారం జబ్బు ఉండదు. దాని పని అది చేసుకుపోతుంది. ఉండాల్సిన బరువుకన్నా అధికంగా ఉన్న ప్రతి కేజీ బరువు వ్యక్తి నేలమీద ఉండాల్సిన రోజుల్ని తగ్గిస్తుంది. రోజుకో గంట వ్యాయామం: ఏ వస్తువును అయినా ఉపయోగించకుంటే అది పనికిరాకుండా పోతుంది. దీనికి శరీరం మినహాయింపేమీ కాదు. సోమరితనం అనేక జబ్బులకు నెలవుగా ఉంటుంది. ఇక్కడ సోమరితనం అంటే పనిలేకుండా కూర్చోవటం అని మాత్రమే కాదు. ప్రతిదానికి యంత్రాలమీద ఆధారపడి ఒంటికి శ్రమ ఇవ్వకపోవటం. రవాణా సాధనాలు అందుబాటులోకి రావటంతో నడక అరుదైపోతుంది. అర కిలోమీటరు దూరంలో ఉన్న ఆఫీసుకు సైతం ఇంటిముందు బైకు కిక్కుకొట్టటం, ఆఫీసు ముందు ఆపటం, పోనీ దానికి ప్రత్యామ్నాయంగా పొద్దున ఓ గంట నడుస్తారా అంటే రాత్రి ఆలస్యంగా పడుకొని పొద్దున హడావుడిగా పనులు చక్కబెట్టుకోవటంతో తీరిక ఎక్కడిదీ? శరీర శ్రమ ఏ మేరకు తగ్గుతుందో ఆ మేరకు రోగాలు దగ్గరవుతూ ఉంటాయి. యాభై ఏళ్ళ వయసులో గుండెపోటుకు గురై చనిపోయిన వ్యక్తి రోజులో కొంత సేపు ఒంటిని శ్రమ పెట్టి ఉంటే మరో ఇరవై ఏళ్లు సజీవుడై ఉండేవాడు. కంటి నిండా నిద్ర: ఎనిమిది గంటల నిద్ర ప్రతివారికి చాలంటారు వైద్యులు. పరుగులు పెట్టించే నేటి సామాజిక జీవనానికి ఉన్న ఇరవై నాలుగు గంటలు చాలటంలేదు. కాబట్టి చేయగలిగింది నిద్ర వేళల్లోకి చొరబడి ఆ సమయాన్ని దొంగిలించటం. లక్షల సంవత్సరాలుగా ప్రకృతి సహజంగా 12 గంటలుగా ఉన్న నిద్ర పారిశ్రామిక విప్లవం తరువాత అంటే మూడు వందల ఏళ్ళలో 8 గంటలకు కుదించుకుపోయింది. ఇంత వేగంగా తగ్గిన నిద్రకు మనసు అలవాటుపడి తట్టుకోగలిగిందే కానీ, శరీరం సర్దుబాటు చేసుకోలేకుండా ఉంది. ఫలితంగా ఆరు, ఏడు పదుల్లో రావాల్సిన గుండె జబ్బులు, పక్షవాతం ఇపుడు ముందుకు జరిగి యాభైలోనే మనిషిని కుదిపేస్తున్నాయ. మరీ ఘోరం ఏమిటంటే గత పుష్కర కాలంలో పిల్లల్లో కార్పొరేటు విద్యవల్ల, పెద్దల్లో టీవీ, కంప్యూటరు వల్ల మరో రెండు గంటలు తగ్గి ఇప్పుడు సరాసరి నిద్ర ఆరు గంటలకు కుదించుకుపోయింది. ఎనిమిది గంటలకు తక్కువగా ఏ మేరకు నిద్ర తగ్గితే దానికి అనుగుణంగా జీవన ప్రమాణాలు దెబ్బతింటాయి. మచ్చుకు రోజుకు గంట నిద్ర తగ్గితే అరవై ఏళ్ళకు రావాల్సిన (కుటుంబ చరిత్ర ఉన్నపుడు) షుగరు యాభై ఏళ్ళకే వచ్చి కూర్చుంటుంది. రెండు గంటలు తగ్గితే నలభైకే సిద్ధం. ఒత్తిడి నుండి ఊరట: ఒత్తిడి సర్వాంతర్యామి. దానికి ఎంత దూరంగా ఉంటే అంతా, ఎంత ఎదుర్కొనే ఛావ ఉంటే అంతగా ఈ భూమీద ఉండటానికి అవకాశం పెరుగుతుంది. ఒత్తిడికి గురైనపుడు విడుదల అయ్యే ‘ఎపినెఫ్రిన్, నారెపినెఫ్రిన్’ అనే క్యాటకాల అమైనులు, ‘కార్టిసాల్’ అనే హార్మోను అవసరానికి మించి విడుదల అయినపుడు శరీరంలో అవయవాల వయసును తగ్గిస్తాయి. నష్ట తీవ్రతను బట్టి తొంభై ఏళ్ళు పనిచేయటానికి రూపకల్పన చేసిన గుండె అరవై ఏళ్ళకే చేతులెత్తేయవచ్చు. ఒత్తిడిని జయించగలిగినవారు ‘జీవన కాలాన్ని’ జయిస్తారు. అలవాట్లు: ఆరోగ్యం చెడిపోవటానికి ఏ అలవాట్లు అయితే పాటిస్తారో అవన్నీ వాటివైన నష్టాలను తెచ్చిపెడతాయి. పొగ తాగటం, మందు బిగించటం, మాదక ద్రవ్యాలు వాడటం, ఇవేకాదు దురుసుగా వాహనాలు నడపటం, దుడుకు ప్రవర్తన, హడావిడి పరుగులు, బాధ్యతారాహిత్యం కూడా వ్యక్తి ‘జీవిత నాణ్యత’ను, ‘జీవితకాలాన్ని హరించివేయవచ్చు.


Comments (0)  |   Category (General)  |   Views (2044)

Community Comments
User Rating
Rate It


Post your comments

 
Browse Archive